Updated : 1/2/2015 3:54:46 PM
-పర్యాటకులను ఆకర్షిస్తున్న కోట
-అబ్బురపరుస్తున్న శిల్పకళా సంపద
-శిథిలావస్థలో చారిత్రక కట్టడం
టీ మీడియా, రాజాపేట: గత వైభవానికి, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది రాజాపేట కోట. రాజాపేట కేంద్రంలోని ఈ కోట పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. పర్యాటకులను ఇక్కడి శిల్పకళ అబ్బుర పరుస్తోంది. ఎన్నో దండయాత్రలు గెలుపోటముల గుర్తులను తనలో దాచుకున్న ఈ కోట నిజాం నవాబుల కాలంలో ప్రత్యేకంగా నిలిచింది. రాజకీయ శక్తుల సమీకరణ రాజ్య స్థాపనలో ముఖ్యపాత్ర వహించింది.
యాదగిరిగుట్టకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ 1775లో రాజరాయన్నరాజు నిర్మించి గ్రామాన్ని ఏర్పాటు చేశారు. దీని చుట్టూ శత్రు దుర్భేద్యమైన రాతి గోడను కట్టించారు. శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కోట లోపలి నుంచి సొరంగ మార్గాలు తవ్వించారు. కోట లోపల అతి సుందర భవనాలు, రాణుల అంతఃపురాలు, స్నానవాటికలు నిర్మించారు. శత్రుసైన్యం కోట గోడల ముందు పెద్ద కందకం తవ్వించి ఎగువ పడమటి వైపు గోపాలచెర్వు నుంచి కందకంలోకి నీరు పారించారు. అందులో మొసళ్లను పెంచేవారు. కోట ముఖ ద్వారానికి పెద్ద తలుపులు అమర్చారు. మొదటి ముఖ ద్వారం నుంచి మూడో ముఖ ద్వారం వరకు సుదీర్ఘమైన రాచమార్గం ఉంది. రాజు నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి స్నానవాటిక, గిరిగిరిమాల్, ఎత్తైన బురుజులు, కారాగారం, కొలను, సైనికుల శిక్షణ స్థలం ఇప్పటికీ ఉన్నాయి.
అబ్బుర పరిచే కళానైపుణ్యం..

రాజాపేట కోటలో శిల్పకళ అబ్బుర పరుస్తోంది. అడుగడుగునా కనిపించే చిహ్నాలు ప్రాంత ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.ప్రధాన దుర్గంలో ప్రతి గడి ఎంతో సుందరంగా ఉంటుంది. దర్వాజలు, బాల్కానీలు, బురుజుల నిర్మాణ రీతి అపురూపం. అద్దాల మేడపైకి ఎక్కేందుకు చార్మినార్ మాదిరిగా మెట్లు నిర్మించారు. భవనంలోని గదుల్లో చెక్కిన శిల్పాలు సింహాసనాలను పోలిన కుర్చీలు కన్పిస్తాయి.
పరిపాలన చరిత్ర

నాటి నిజాం నవాబుల 14 సంస్థానాలు ఉండేవి. సంస్థాన్ నారాయణపురం, సంస్థాన్ రాజాపేటలను ప్రధానంగా చేసుకొని వారు కార్యకలపాలు జరిపేవారు. ఇక్కడ సంస్థానాధీశుల ప్రధాన వృత్తి వ్యసాయం. ప్రభుత్వ భూములను కౌలుకిచ్చి సేద్యం చేయించేవారు. రాజరాయన్న తరువాత రాజా వెంకటనారాయణరావు బహదూర్ రాజ్యాధికారం ఆయన భార్య జానకమ్మ నాడు దేవాలయాలు, గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేపట్టారు. కొంత భూమిని దానం చేశారు. వీరి పాలనలోనే సంస్థాన్ నారాయణపురం ఏర్పాటు జరిగింది. వీరి కాలంలో పాలన జరిగిందని పెద్దలు చేపుతుంటారు. అనంతరం రాజా వెదిరి వెంకటనారాయణరావు కుమారుడు రాజా జశ్వంత్‌రావు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.
శిథిలావస్థలో పురాతన కట్టడం

ఎంతో అద్భుత రాజాకోట నేడు శిథిలావస్థలో ఉంది. చారిత్రాత్మక కట్టడాన్ని పర్యాటక శాఖ పట్టించుకోకుండా వదిలేసింది. నిర్మాణాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో పర్యాటకప్రియులు ఆందోళన వ్వక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గణతంత్ర వేడుకలు రాజాకోటలో నిర్వహించారు. తెలంగాణలోని చారిత్రాత్మక పురాతన కట్టడాలను వెలుగులోకి తేవాలని సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేయగా, అదే స్ఫూర్తితో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రాజాకోటపై జెండా ఎగురవేశారు. దీంతో కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రాజాపేట కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు.